Leading News Portal in Telugu

Minister BC Janardhan Reddy: మౌలిక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధికి వెన్నెముక


  • మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రులు లోకేష్..బీసీ జనార్ధన్ రెడ్డి
  • మౌలిక సదుపాయాల కల్పన ఆర్ధికాభివృద్ధికి వెన్నెముకగా నిలబడుతోందని వెల్లడి
Minister BC Janardhan Reddy: మౌలిక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధికి వెన్నెముక

Minister BC Janardhan Reddy: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కీలక సదస్సుతో మౌలిక వసతుల రంగంలో వృద్ధి, నూతన పెట్టుబడుల అన్వేషణకు, పెట్టుబడుల్లో భాగస్వామ్యానికి మంచి అవకాశం లభించినట్లైందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ఆర్ధికాభివృద్ధికి వెన్నెముకగా నిలబడుతోందన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా 5 ట్రిలియన్ ఎకానమీ సాధించడం జరుగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో త్వరితగతిన వృద్ధి, అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడి ముందుకు సాగుతూ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ కీలక పెట్టుబడులు సాధించేందుకు, ఒక మోడల్ స్టేట్ గా నిలిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.. ముఖ్యంగా ఎయిర్ పోర్టులు, రోడ్లు, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ – చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు మరియు గ్రీన్ పోర్టుల అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనే రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తోందన్నారు.

లాజిస్టిక్స్, ఎకనామిక్ కారిడార్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప అవకాశాలున్నాయని, 973 కి.మీ సుధీర్ఘ కోస్తా తీర ప్రాంతంతో రాష్ట్రంలో అపారమైన అవకాశాలు కల్పిస్తోందన్నారు. రూ. 17,605 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టులతో పాటు కొత్తగా 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మల్టీమోడల్ లాజిస్టిక్స్‌తో కూడిన పోర్టులు, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కారిడార్‌లు అమల్లోకి రావడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయాన్ని భారీగా తగ్గించడం ద్వారా భారతదేశం అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయికి ఎదిగిందన్నారు.. నేడు జీడీపీలో సుమారుగా 14 శాతంగా ఉన్న మన లాజిస్టిక్స్ వ్యయాన్ని 8 శాతం తగ్గించుకోవడం ద్వారా మనం అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడగలుతున్నామన్నారు. పోర్టుల అభివృద్ధి ద్వారా లాజిస్టిక్స్‌ను మెరుగుపరచుకోవడం, ఖర్చును తగ్గించుకోవడం ద్వారా మనం అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడగలుగుతున్నామన్నారు.

ప్రస్తుతం దేశంలో ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధిలో మారిటైమ్ హబ్‌గా ఉందని, ఎయిర్ పోర్టులను ప్రాంతీయ, అంతర్జాతీయంగా అనుసంధానించడంలో గణనీయమైన పురోగతి సాధించడం ద్వారా ప్రయాణీకులు, కార్గో రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వానికే తలమానికమైన ప్రాజెక్టు.. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎయిర్ కనెక్టివితో పాటు, ప్రయాణీకులు రద్దీ, కార్గో లాజిస్టిక్స్‌ను గణనీయంగా పెంచవచ్చని తెలియజేశారు. కార్గో లాజిస్టిక్స్‌ను గణనీయంగా పెంచడంతో పాటు సమగ్రంగా గ్లోబల్ మార్కెట్ విశ్లేషణకు గేట్ వేగా భోగాపురం విమానాశ్రయం పనిచేస్తుందన్నారు.

అలాగే ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎయిర్ పోర్టులకు మౌలిక సదుపాయాలను కల్పించడం మీద దృష్టి పెట్టడంతో పాటు అదనంగా వాటిని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తు ఎయిర్ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా.. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో నూతన పెట్టుబడులు సాధించడానికి సంబంధించి నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నామని, పెట్టుబడులకు సంబంధించి సాంప్రదాయ పద్దతులను భిన్నంగా అనేక కొత్త విధానాల్లో పెట్టుబడులు పొందాల్సిన పరిస్థితి నేడు ఉందన్నారు. పీపీపీ వంటి వినూత్న విధానాలను ఇప్పటికే రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల వంటి రంగాల్లో అమలు చేస్తున్నామని, తద్వారా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేస్తోందన్నారు.

భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడానికి పట్టణ మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం రంగంలోనూ ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం మన మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.