- స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం అభిప్రాయ సేకరణ చేశాం
- ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి జనసేన వాళ్లకు అండగా నిలబడింది
- ప్రజల కోసమే పవన్ నిర్ణయాలు
- మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి

Minister Nadendla Manohar: స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. నేషనల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి నేతన్నకు అండగా ఉంటామన్నారు. మిగతా జిల్లాల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని మంత్రి తెలిపారు. కలిసి కట్టుగా చేసే అభివృద్ధితో రాష్ట్రం వికశించేలా ప్రణాళికలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి జనసేన వాళ్లకు అండగా నిలబడిందన్నారు. వరదల సమయంలో జనసేన ప్రజలకు అండగా నిలబడిందని వెల్లడించారు. తిరుపతి లడ్డు వివాదం సృష్టించిందే వైసీపీ అంటూ ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారన్నారు. మన సంస్కృతిని, మనం కాపాడుకోలేకపోయామని.. వైసీపీ పాలనలో మతం, భాష అంటూ ప్రజలను విడగొట్టారని ఆరోపణలు చేశాలు. ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రజలకు నష్టం కలిగించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం ఆయన స్వార్థం కోసం కాదని, రాజకీయ లబ్ధి కోసం కూడా కాదన్నారు. సమాజం కోసం,దేశం కోసం.. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని గౌరవించుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్తారన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలని పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని మంత్రి తెలిపారు. ప్రతి దాన్ని కావాలని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సమయాన్ని వృథా చేసుకోవద్దు, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలన్నారు.
విజయవాడ వరదలు సమయంలో, ప్రతిపక్షం ఫోటోలకు పరిమితమైందని… క్షేత్రస్థాయిలో ఎక్కడ పని చేయలేదని ఆరోపించారు. తోటి మానవుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీకి నిబద్ధత నిజాయితీ ఉన్నాయని.. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉందని.. అందుకే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించారన్నారు. భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించబోతోందన్నారు. భవిష్యత్తు తరాల కోసం కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు ప్రజాహిత పాలన తెలియదని విమర్శలు గుప్పించారు. సీఎంపై ఉన్న నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం నిజాయతీగా చేస్తున్నామన్నారు. జ్ణానం దక్షత లేకుండా ప్రతిపక్షం గతంలో పాలించిందని.. రాష్ట్రానికి, దేశానికి మన వంతుగా ఏమి చేస్తాం అన్నదే జనసేన ఆలోచిస్తుందన్నారు. సనాతన ధర్మం సమస్య సృష్టించింది వైసీపీ ప్రభుత్వమని.. పవన్ సనాతన ధర్మాన్ని రక్షించాలని చెబితే తప్పు ఏమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తే ప్రతిపక్షానికి గౌరవం ఉంటుందన్నారు.