Leading News Portal in Telugu

CM Chandrababu Delhi Tour: హస్తినలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. నేడు కీలక భేటీలు


  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ..

  • నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ..

  • అమిత్ షా.. నిర్మలా సీతారామన్ తో చర్చ..
CM Chandrababu Delhi Tour: హస్తినలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. నేడు కీలక భేటీలు

CM Chandrababu Delhi Tour: తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. తొలుత ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర హోంశాఖ కీలక సమావేశానికి హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై… పలు కీలక అంశాలపై చర్చించారు.తెలంగాణకు వరద నష్టం సాయం పెంచాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో మూసీ ప్రక్షాళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.

అటు కేంద్ర ప‌ట్టణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌తో కూడా భేటీ అయిన రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‎కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కోరారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదటి విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15 వేల కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఢిల్లీ టెన్‌ జన్‌పథ్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. విశాఖ రైల్వే జోన్‌ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. రెండోరోజు పర్యటనలోభాగంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, పీయూష్ గోయల్, హార్దీప్‌ సింగ్ పూరితో భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్న ఏపీ సీఎం.. సాయంత్రం 4.30కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవుతారు.. ఇక, 5:45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీకానున్నారు.. రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు.. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..