Leading News Portal in Telugu

Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు


  • కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి
  • వేట నిషేధ భృతి అమలుకు చర్యలు
  • హార్బర్ల అభివృద్ధికి ప్రణాళిక
  • మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు

Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ భృతి 20 వేలుకు పెంచి అందించే ప్రక్రియకు సన్నాహాలు చేయాలని, నిజమైన లబ్ధిదారుల ఎంపిక గురించి చేపట్టే సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

మత్స్యకారుల బోట్లకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు అమర్చడం, డీజిల్ వినియోగం స్థానంలో మెరైన్ ఫ్యూయల్ వినియోగం వంటి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మత్స్య శాఖలో ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు అంశంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. సీడ్ స్టాకింగ్ వ్యవస్థను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. బాదంపూడి, కొవ్వలి సీడ్ పాండ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 8 హార్బర్ల అభివృద్ధికి దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2014 – 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవంతంగా మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు తిరిగి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. సమీక్షా సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ టి.డోలా శంకర్, ఇతర మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.