Leading News Portal in Telugu

Vizianagaram: గొర్ల గ్రామంలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ..


  • గొర్లలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ

  • ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడిన సీఎం.
Vizianagaram: గొర్ల గ్రామంలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ..

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని సీఎం నిర్ణయించారు. మరణాలకు అసలు కారణం ఏంటీ, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటీ అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సీఎం భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని.. సమస్య పరిష్కారం అయ్యే వరకు తాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే.. వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్లుఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి.. సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.