- గుర్లలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్
- గంటలోనే గుర్ల టూర్ ముగిసింది
- అసంతృప్తికి గురైన ప్రజలు

Pawan Kalyan Tour in Gurla: విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. స్థానిక పీహెచ్సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్లలో బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్నారు. ఇన్ ఫిల్టరైజేషన్ పాయింట్ వద్ద అడుగుపెట్టిన ఆయన.. పీహెచ్సీలో బాధితులను చూశారు. గ్రామ ప్రజలతో మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు.
అధికారులను దగ్గరకు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేతలను పక్కన పెట్టారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలను సైతం పవన్ బృందం దూరం పెట్టింది. పవన్ అభిమానులను అదుపు చెయ్యలేక పోలీసులు చేతులెత్తేశారు. భారీగా అభిమానులు ఉండడంతో మూడు కుటుంబాలతో మాత్రమే డిప్యూటీ సీఎం మాట్లాడారు. దాంతో కొందరు అసంతృప్తికి గురయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ ఓ గంటలోనే గుర్ల టూర్ ముగించుకున్నారు.
అంతకుముందు నెల్లిమర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేట వద్ద తాగునీటి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఇక సాయంత్రం విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.