Leading News Portal in Telugu

Pemmasani Chandra Shekar: అక్రమాలకు తావు లేకుండా ‘ఆవాస్’ లబ్ధిదారుల ఎంపిక


  • ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష
  • గుంటూరులో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు అవగాహన కార్యక్రమం
Pemmasani Chandra Shekar: అక్రమాలకు తావు లేకుండా ‘ఆవాస్’ లబ్ధిదారుల ఎంపిక

Pemmasani Chandra Shekar: కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న హౌసింగ్ పథకంలో డూప్లికేట్ లబ్ధిదారులు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి తాజాగా రూపొందించిన ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరులో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నమోదైన రెండు కోట్ల నూతన గృహాలకు సరైన లబ్ధిదారులను, పారదర్శకంగా ఎంపిక చేయటానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనితోపాటు పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కూడా అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రానున్న 5 సంవత్సరాలలో ప్రతి అర్హుడైన పేదవాడికి గృహాలను అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని తెలిపారు. 2014 నుండి 19 వరకు యూనిట్ కాస్ట్ రెండున్నర లక్షలు ఉండగా.. గత వైసీపీ ప్రభుత్వం దానిని 1.8 లక్షలకు తగ్గించిందని.. అందువల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణం కుంటుపడిందని ఆయన ఆరోపించారు. కాలనీలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు వస్తారనే ఆలోచనతో ముందుగా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామని కొలుసు పార్థసారథి తెలిపారు. జేజేఎం, NREGS వంటి పథకాల ద్వారా జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తామని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.