Leading News Portal in Telugu

Minister Gottipaati Ravi Kumar Fires on YS Jagan


  • విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు
  • గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదని విమర్శలు
Minister Gottipaati Ravi Kumar: గడిచిన ఐదేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత లేదు..

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ రంగంలో గత ప్రభుత్వంలో చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏలను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి.. ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.

గడిచిన ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. గత ఐదేళ్లలో చేసిన పాపాల కారణంగా ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి గాను మరో రూ.11,826.42 కోట్ల భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఈ మొత్తాన్ని డిస్కంలు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని ఈఆర్సీని కోరినా సంబంధీకులు వాయిదా వేస్తూ వచ్చారని చెప్పారు. చివరగా 2024 మార్చి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాల్సి వస్తే… ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాయిదా పర్వం కొనసాగినట్లు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలోనే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన మొత్తాన్ని కమిషన్ వాయిదా వేస్తూ అక్టోబర్ లో నిర్ణయం తీసుకుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ కారణంగా జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సి వస్తోందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచితన నిర్ణయాలతోనే ప్రజలపై విద్యుత్‌ సర్దుబాటు చార్జీల భారం పడిందని స్పష్టం చేశారు.