Leading News Portal in Telugu

BC Community Leaders Meet CM Chandrababu to do BC Census


  • జనగణనతో పాటు బీసీ గణన కూడా చేయాలి..

  • సీఎం చంద్రబాబుకు బీసీ సంఘాల నేతల వినతి..

  • వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం అందజేత..
BC Census: బీసీ గణన చేయాలని సీఎం చంద్రబాబుకు వినతి..

BC Census: 2025 నుంచి దేశ వ్యాప్తంగా జరగనున్న జనగణనలో బీసీ జనగణన కూడా చేపట్టాలని బీసీ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షులు కేసన శంకర్ రావు నేతృత్వంలో బీసీ ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి 10 అంశాలతో కూడిన వినత పత్రాన్ని అందించారు.

కాగా, అమరావతి రాజధానిలో జ్యోతిరావ్ పూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్లను దామాషా ప్రకారం పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని బీసీ సంఘాల నేతలు కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, దామాషా ప్రకారం రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇక, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలని, బీసీలపై తప్పుడు క్రిమినల్ కేసులు మాఫీ చేయాలని బీసీ సంఘాల నేతలు కోరారు. బీసీ నేతలు లేవనెత్తిన అంశాలను సావధానంగా విన్న సీఎం.. వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీ నేతలు వరద బాధితుల సహాయార్ధం రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించగా, చంద్రబాబు వారిని అభినందించారు. సీఎంను కలిసిన వారిలో జాతీయ, రాష్ట్ర బీసీ సంఘాల నేతలు ఉన్నారు.