Leading News Portal in Telugu

Home Minister Anitha Vangalapudi Meet Deputy Cm Pawan Kalyan


  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన హోంమంత్రి అనిత..

  • రాష్ట్రంలో శాంతి భద్రతలు.. ముందస్తు భద్రతా చర్యలపై చర్చ..

  • దీపావళికి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా అలర్ట్ గా ఉండాలి: పవన్
Anitha- Pawan: డిప్యూటీ సీఎం పవన్ని కలిసిన హోంమంత్రి అనిత.. కీలక అంశాలపై చర్చ!

Anitha- Pawan: మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిపారు. 185 అగ్నిమాపక స్టేషన్లు, సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి వెల్లడించారు. 100 లేదా 101 నంబర్లకు ఫోన్ లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ సూచించారు.

ఇక, వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన ‘దియాజలావ్’ కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణహిత టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో విమానాలలో బాంబు బెదిరింపులపైనా హోంమంత్రిని అడిగి డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు.

అలాగే, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన రాష్ట్రంలోని అరాచక పరిస్థితులు ఇటీవల బయటికి వస్తున్న దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి.. నిందితులను శిక్షించేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణ పట్ల డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు. నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ వినియోగించాలని హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల పట్ల గతంలో లేని విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు హోమంత్రి వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రికి వివరించిన హోంమంత్రి.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కిలో మీటర్ మేర నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని ఆమె కోరారు. పాయకరావుపేటలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని డిప్యూటీ సీఎంకు అనిత వినతి పత్రం సమర్పించారు. తన నియోజకవర్గంలోని పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం సహా ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రాధాన్యతను పవన్ కు హోంమంత్రి తెలిపింది.