- పీఎం స్వనిధి పథకం సమర్థంగా అమలు చేసిన వారికి జాతీయ- రాష్ట్ర స్థాయి అవార్డులు..
-
మున్సిపాలిటీల కమిషనర్లు- బ్యాంకు అధికారులకు అవార్డులు అందజేసిన మంత్రి నారాయణ.. -
పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది: నారాయణ

Minister Narayana: పీఎం స్వనిధి పథకం సమర్థంగా అమలు చేసినందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేత. 38 మంది అధికారులకు పీఎం స్వనిధి అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పలు మున్సిపాల్టీల కమిషనర్లు, బ్యాంకు అధికారులకు అవార్డులు ప్రకటించారు. ”పీఎం స్వనిధి” పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు అవార్డులు అందజేత. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను మంత్రి నారాయణ అందించారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్దిదారులను సన్మానించారు మంత్రి.
ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నాం.. పీఎం స్వనిధి పథకం కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చు అన్నారు. పథకం కింద లబ్దిదారులకు రుణాలపై కేంద్రం 7శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది అని చెప్పారు. కేవలం 4.5 శాతం వడ్డీ మాత్రమే లబ్దిదారులు భరించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. పేదలంతా పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద 5 లక్షల 48 వేల 957 దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు.
ఇక, వచ్చిన దరఖాస్తుల్లో 5 లక్షల 2 వేల 894 మంది పేదలకు రుణాలిచ్చారు అని నారాయణ చెప్పారు. పీఎం స్వనిథి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పని తీరు కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. అవార్డులు గెలిచిన గుంటూరు, పుత్తూరు, రాయచోటి మేజర్ మన్సిపాలిటీ కమిషనర్లకు అభినందనలు.. అత్యుత్తమ పని తీరు కనపరిచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన పలు మైనర్ మున్సిపాలిటీ కమిషనర్లు, బ్యాంకర్లకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని సూచనలు చేశారు. పేద మహిళలు లక్షాధికారులు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం.. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.