Leading News Portal in Telugu

Minister Nara Lokesh Meets Former PepsiCo CEO Indra Nooyi


  • అమెరికా పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్..

  • పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో ఇంద్రా నూయితో భేటీ..

  • సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు..

  • వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది..

  • ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..
Minister Lokesh Meets Indra Nooyi: పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయితో మంత్రి లోకేష్ భేటీ

Minister Lokesh Meets Indra Nooyi: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. పలు ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు అవుతున్నారు.. ఏపీలో ఉన్న వనరులు.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు.. ఇక, ఈ పర్యటనలో భాగంగా లాస్ వెగాస్ లో పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో అయిన ఇంద్రా నూయితో సమావేశం అయ్యారు.. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కండి. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వండి. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటిచెప్పండి అంటూ పిలుపునిచ్చారు..

ఇక, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తరపున కార్యక్రమాలను రూపొందించండి.. లింగ వైవిధ్యం సంస్థాగత విజయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో చర్చించండి అన్నారు మంత్రి లోకేష్.. వివిధ రంగాలలో మహిళలకు సాధికారత కల్పించడంపై మీ ఆలోచనలను మాతో పంచుకోండి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్ నెస్ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సి ఉంది. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వరంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించండి అని కోరారు.. విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యువ నిపుణులు వారి కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడడానికి మా రాష్ట్రాన్నిసందర్శించండి. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందిస్తూ ఏపీలో పెట్టుబడుల రాబడికి తమవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు..