Leading News Portal in Telugu

Minister Nimmala Ramanaidu About Polavaram Project


  • రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే
  • అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్‌ ఇవ్వొచ్చు
  • జగన్‌కు ఎక్స్‌ వేదికగా మంత్రి నిమ్మల కౌంటర్‌
Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: మంత్రి నిమ్మల

ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే అని ఆరోపించారు. అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని కౌంటర్‌ ఇచ్చారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి.. జగన్‌ ఛీత్కారానికి గురయ్యారని నిమ్మల ఎద్దేవా చేశారు.

‘ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఈ వైఎస్ జగన్‌ తప్ప. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్‌కు అర్థం అయిపోయింది. అందుచేతనే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు. పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి.. గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి నేను పూర్తి వివరాలతో పోలవరం ప్రాజెక్టుకు జగన్ చేసిన ద్రోహం గురించి వివరించా. అయినా అతని బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణ మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రైబ్యునల్‌కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారు’ అని మంత్రి నిమ్మల ఎక్స్‌లో పేర్కొన్నారు.

‘పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి జగన్ కారుకులయ్యారు. ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోగొట్టారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా. పోలవరానికి కేంద్రం ఇచ్చిన 3800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా. కేంద్రాన్ని 41.15 మీటర్లకు తగ్గించి అనుమతి కోరింది జగన్ కాదా. మా ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవింప చేస్తాం. జగన్ ఇప్పటికైనా అబద్ధాలు మాని.. మీ కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో. ఇది నీ హితువు కోరి చెబుతున్నా’ అని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు.