- రుషికొండ భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- భవనాల వినియోగంపై అధికారులతో చర్చలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిని రేపుతోంది. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం నేరుకు రుషికొండకు చేరుకున్నారు. మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రుషికొండ భవనాలను ఏ అవసరాలకు వినియోగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
గత వైసీపీ సర్కారు హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లో రుషికొండకు వచ్చి భవనాలను పరిశీలించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు భవనాలను పరిశీలించడం గమనార్హం. ఈ భవనాలను ఏం చేయాలి.. ఏ విధంగా ఉపయోగించాలి?.. అనే దానిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ భవనాల వినియోగంపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.