Leading News Portal in Telugu

Kakani Govardhan Reddy Fires on Chandrababu Pawan Kalyan And Lokesh


  • ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చారు..

  • అధికారంలోకి వచ్చాక అమలు చేయలేక మాటలు చెబుతున్నారు..

  • సీఎం చంద్రబాబుపై కాకాణి విమర్శలు..
Kakani Govardhan Reddy: విమర్శిస్తే కేసులా..? ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు..!

Kakani Govardhan Reddy: ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని అమలు చేయలేక మాటలు చెబుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు లబ్ధిదారులను మొదట డబ్బులు చెల్లించమని.. తర్వాత ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారన్నారు. అనేక కార్యక్రమాల్లో విఫలం అవుతున్న చంద్రబాబు.. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ను ఎదుర్కొనలేక ఆయన కుటుంబం మీద వివిధ రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. వ్యక్తిగత విషయాలు.. కుటుంబ విషయాలు తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు.. రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను వదలడంలో లోకేష్ దిట్ట అని కాకాణి అన్నారు. వందలాది కోట్ల ఆస్తులున్న చంద్రబాబు తన సోదరుడు.. చెల్లెళ్లకు ఎంత మేర పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను తొక్కి పెట్టి నార తీస్తానని అంటున్న పవన్ కల్యాణ్‌ .. అన్యాయాలు అక్రమాలు చేస్తున్న టీడీపీ నేతల నార తీయాలని సూచించారు. ప్రభుత్వ విమర్శిస్తే కేసులు పెడుతున్నారని ఎన్ని కేసులు పెట్టినా.. భయపడే ప్రసక్తే లేదన్నారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి..

చంద్రబాబు టీ కాచి ఇచ్చారు.. ఇచ్చిన హామీ మేరకు మూడు సిలిండర్లు ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు కాకాణి.. అది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు.. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక… ఆయన కుటుంబం మీద వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.. వ్యక్తిగత విషయాలు.. కుటుంబ విషయాలను తీసుకురావడం సిగ్గుచేటు.. రెండేళ్ల క్రితం విజయమ్మ కారుకు ప్రమాదం జరిగితే దాన్ని కుట్రగా ప్రచారం చేస్తున్నారు.. ఇది సంస్కారం కాదు అని హితవు చెప్పారు.. ఇక, ఎన్టీఆర్ మరణానికి కారణం ఎవరు..? ఆయన పార్టీని ఆయన గుర్తును.. కార్యాలయాన్ని లాక్కొని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరు? అని నిలదీశారు.. ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కారు కు ప్రమాదం జరిగింది.. దానికి కుట్ర కోణం ఉందని మేం భావించాలా? అని ప్రశ్నించారు.. షర్మిలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు.. అంత అవసరమేముంది.. పవన్ కళ్యాణ్ లోని ఒక మహిళ తనకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఎన్నో సార్లు చెప్పిందన్నారు.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 77 మంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి.