Accident in Tiruchanur Shilparamam fun ride.. A woman died after falling from a height of 20 feet while spinning on a giant wheel.
- తిరుచానూరు శిల్పారామం ఫన్ రైడ్‌లో ప్రమాదం
- జెయింట్ వీల్‌లో తిరుగుతూ 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఇద్దరు మహిళలు
- ఒక మహిళ మృతి.. మరో మహిళకు తీవ్ర గాయాలు.

తిరుచానూరు శిల్పారామంలో ప్రమాదం జరిగింది. శిల్పారామం క్యాంటీన్ వద్ద గల ఫన్ రైడ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. జెయింట్ వీల్‌లో తిరుగుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ క్రమంలో.. ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన ఇద్దరు మహిళలు కూర్చున్న క్రాస్ వీల్ విరిగిపోవడంతో అక్కడి నుంచి పడిపోయారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు.
ఈ ప్రమాదంపై శిల్పారామం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాదరవల్లి స్పందించారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇద్దరు మహిళలు.. పై నుంచి కింద పడిపోయిన వెంటనే వారిని వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలించామన్నారు. సాధారణంగా క్రాస్ వీల్‌లో 60 కేజీలకు మించి ఎవరిని ఎక్కించకూడదు.. అయితే నిర్వాహకుడు ఒక మహిళను ఎక్కించే సమయంలో తాము ఇద్దరం స్నేహితులే అనడంతో ఇద్దరిని ఎక్కించారని అన్నారు. ఇద్దరు అధిక బరువు ఉండడంతో వారు కూర్చున్నటువంటి ఇనుప వీల్ రెండు ముక్కలుగా విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. నిర్వాహకుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రాథమికంగా ఘటన జరిగినట్టు నిర్ధారించామని శిల్పారామం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తెలిపారు.