- ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ
- ప్రస్తుతం మార్కెట్లో ధరల పరిస్థితిపై సమీక్ష

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు. టమాటా, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ధరల పరిస్థితిని మంత్రులు, అధికారులు సమీక్షించారు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా బియ్యం ధరల స్థిరీకరణ జరిగినట్లు గుర్తించారు.
ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా కందిపప్పు ధరలు తగ్గాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగినట్లు గుర్తించారు. పెరిగిన వంటనూనె ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లీటర్ పామాయిల్ 110 రూపాయలకు ప్రభుత్వం అమ్మకాలు చేపడుతోంది. దిగుమతి దారులు, హోల్ సేల్ నిర్వాహకులు, రిటైల్ దారులతో ప్రభుత్వం చర్చలు జరిపి అనంతరం రాయితీ ధరలపై వంటనూనెను అమ్మకానికి క్యూ ఆర్ కోడ్ ద్వారా అమ్మకాలు జరపనుంది.రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, పంచదారను సబ్సిడీ ధరలకు సప్లై చేయనుంది.
కందిపప్పు కేజీ 67 రూపాయలు, పంచదార అర్థ కేజీ 16 రూపాయలు, పామాయిల్ లీటర్ 110 రూపాయలకు రైతు బజార్తో పాటు రాష్ట్రంలోని 2200 రిటైల్ అవుట్ల ద్వారా సబ్సిడీ ధరలకు అమ్మకాలు చేపట్టనుంది. కూటమి ప్రభుత్వ చర్యలతో గత నెలలో ఉల్లి, టమాటా ధరలు తగ్గాయి. 154 మండల కేంద్రాల్లో సీపీ యాప్ ద్వారా ప్రతీరోజూ ధరల సేకరణపై ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది. ధరల స్థిరీకరణ కోసం 500 కోట్లతో నిధి ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. సంస్కరణలో భాగంగా రెండు పర్సెంట్ ఉన్నా మార్కెట్స్ రుసుము (cess) వన్ పర్సెంట్కు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది.