- పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
- వేమవరంలో సరస్వతి పవర్ భూములు పరిశీలించిన పవన్
- గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా భూములు అమ్మారు
- భయపెట్టి..దాడులు చేసి పట్టా భూములు లాక్కున్నారు
- భూములు ఇవ్వబోమన్నవారిపై పెట్రోల్ బాంబులు వేశారన్న పవన్

Pawan Kalyan: పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు. సరస్వతి సిమెంట్స్ కోసం భూములను రైతులకు ఇష్టం లేకుండా గత ప్రభుత్వాలు తీసుకున్నాయని మండిపడ్డారు. కేవలం ఫర్నిచర్ వాడుకున్నారని నెపంతో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తిని వేదనకు గురి చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్‌ను వైసీపీ నేతలు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. 1180 ఎకరాలు సరస్వతి భూముల పేరుతో ఆక్రమించుకున్నారని అన్నారు. 24 ఎకరాల ఎస్సీల భూములను లాక్కున్నారని.. పెట్రోల్ బాంబులు వేసి బెదిరించి భూములను లాక్కున్నారని విమర్శించారు.
అందుకే రైతులకు అండగా ఉండటానికి తాను ఇక్కడికి వచ్చానన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూమి కాకుండా 350 ఎకరాలు అదనంగా భూమిని తీసుకున్నారని మండిపడ్డారు. 400 ఎకరాల అటవీ భూమిని రెవిన్యూ భూములుగా మార్చేశారన్న ఆయన.. వాటిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేయాలన్నారు. 30 సంవత్సరాలు లీజు తీసుకున్న భూమిని, జగన్ సీఎం అవగానే 50 సంవత్సరాలు లీజుగా మార్చేశారన్నారు. ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పించకుండా, సహజ వనరులు దోచేస్తున్నారని మండిపడ్డారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతులు వస్తాయో లేదో అని, పవర్ ప్లాంట్ కింద అనుమతులు తీసుకున్నారన్నారు. అనుమతులు కూడా తీసుకోకుండా కృష్ణా జలాలను కూడా తీసుకునే లాగా అనుమతులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కట్టని సిమెంట్ ఫ్యాక్టరీకి ,196 కోట్ల లీటర్ల నీరు ఎందుకు అంటూ పవన్ ప్రశ్నించారు.
భవిష్యత్తులో ఇక్కడ ప్రజల మీద దాడులు జరిగితే, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలి… లేదంటే దానికి బాధ్యత మిమ్మల్ని చేస్తామని హెచ్చరింటారు. సరస్వతీ భూములు ఇచ్చిన రైతుల హక్కుల కోసం, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. పోలీసులు మెత్తబడిపోయారా, లేక భయపడుతున్నారా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందన్నారు. ఇంకా వైసీపీ నాయకులే ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. వారి తోలు తీస్తామంటూ హెచ్చరించారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందో చూపించాలన్నారు. గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న యువతను వేధించిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అండతో పెట్రోల్ బాంబులు వేసి బెదిరించిందని ఆరోపించారు.