- కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస..
-
ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వర్సెస్ వైసీపీ.. -
ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా గౌరవం ఇవ్వడంలేదని ఆగ్రహం.. -
కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మండిపాటు..

MLA Madhavi Reddy Vs YSRCP: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య ప్రారంభం కాక ముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలు లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు.. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి.. ఈ సందర్భంగా వైసీపీ మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. విచారణకు సిద్ధమేనా..? అంటూ సవాల్ విశారు. దీంతో సమావేశంలో గంటకు పైగా గందరగోళం నెలకొంది.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడవద్దని కౌన్సిల్ సభ్యులు గొడవకు దిగారు.. దీంతో.. సభలో గందరగోళం కొనసాగింది.. కొందరు కార్పొరేటర్లు సమావేశం నుంచి బైకాట్ చేసి వెళ్లిపోయారు.. చివరకు మేయర్ సురేష్ బాబు అసహనానికి గురై కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు..
కార్పొరేషన్ నిధులను మేయర్ సొంతానికి వాడుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి.. ఎమ్మెల్యే ఆరోపణలకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించారు మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు.. అయితే, ఒక మహిళగా నా పట్ల చులకన భావన ఎందుకు? వీళ్లు కుర్చీలు లాగేసిన ప్రజలు నాకు పెద్ద కుర్చీ వేశారు.. ప్రజల ప్రేమాభిమానాల కోసం నేను పోరాడుతాను.. అహంకారం.. అధికారానికి తోడైతే ఎలా ప్రదర్శిస్తారో ఈ సమావేశమే నిదర్శనం అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. సొంత కారు వాడుకుంటూ కార్పొరేషన్ నిధులను మేయర్ వాడుకుంటున్నాడన్న ఆమె.. మహిళను అవమానించిన వారు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు.. సంప్రదాయాలకు విరుద్ధంగా మహిళలను అవమానించారు.. దేవుని కడప సుందరీ కరణ ఇంతవరకు జరగలేదు.. చిన్నచౌక్ ప్రాంతానికి మేయర్ ఏం చేశారు..? కుర్చీ లాగేస్తే ఇంట్లో కెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాం అనుకున్నారేమో అలా జరగదు.. ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా కుర్చీలాట ఆడుతున్నారు.. తెలుగుదేశం మహిళ ఎమ్మెల్యేలను గౌరవించకుండా ఇలా అవమానించడం సాంప్రదాయమా? అంటే నిలదీశారు.. ఈ పెద్ద మనిషి చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు అంటూ మేయర్‌పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి..