Leading News Portal in Telugu

AP Deputy CM Pawan Kalyan Says Caring for women is our first priority


  • అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్‌
  • మహిళల సంరక్షణే మొదటి ప్రాధాన్యత
  • చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోము
Pawan Kalyan: మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు: డిప్యూటీ సీఎం పవన్‌

తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఐపీఎస్ అధికారులపై మాజీ సీఎం వైఎస్ జగన్ బెదిరింపులు ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతామన్నారు. మహిళల సంరక్షణ తమ మొదటి ప్రాధాన్యత అని, అందుకోసం ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని పవన్‌ పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పవన్‌ పలకరించారు.

అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు. ఐపీఎస్ అధికారులపై వైఎస్ జగన్ బెదిరింపులు ఆపకపోతే కఠిన చర్యలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోము’ అని హెచ్చరించారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం. ఎందుకంటే.. మహిళల సంరక్షణ మా మొదటి ప్రాధాన్యత. మహిళల సంరక్షణ కోసం ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులు అరికట్టడానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ అవసరం. స్కూల్ ఏజ్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అడవుల్లో మృగాలను వేటాడే వారిపై, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వారిపై చర్యలు ఉంటాయి. రాబోయే నెలల్లో వెయ్యి మెట్రిక్ టన్నుల గంధపు చెట్లను వేలం వేయబోతున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ సంస్థ అయినా ఈ వేలంలో పాల్గొనవచ్చు’ అని పవన్‌ కళ్యాణ్ తెలిపారు.