Leading News Portal in Telugu

New Procedure for Building Permission in towns and cities in Andhra Pradesh, Says Minister Narayana


  • ఏపీలో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానం
  • దేశంలోనే మొదటిసారిగా భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్ విధానం
  • మంత్రి నారాయణ వెల్లడి
Minister Narayana: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానం

Minister Narayana: నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు. ఆ ప్లాన్ ప్రకారమే భవనాలను నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణ ప్రక్రియను సంబంధిత మున్సిపల్ అధికారులు పరిశీలిస్తుంటారని.. ప్లాన్ ప్రకారం భవనాన్ని నిర్మించకుంటే.. సంబంధిత లైసెన్స్ డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు బాధ్యత వహించాలన్నారు.

భవన్ నిర్మాణంలో డీవియేషన్ ఉంటే సంబంధిత లైసెన్స్ డ్ సర్వే యర్ లేదా ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆయా మున్సిపాలిటీలు.. వివిధ శాఖలకు సంబంధించిన ఫీజులను ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫైర్.. రిజిస్ట్రేషన్, శానిటరీ లాంటి ఇతర శాఖల అనుమతులు కూడా ఆన్ లైన్‌లోనే వస్తాయన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అధ్యయనాన్ని చేశామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా భవన నిర్మాణ అనుమతులకు ఆన్ లైన్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. దీనిని మరింత మెరుగుపరిచేందుకే కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. వివిధ శాఖల సాఫ్ట్ వేర్లు మున్సిపల్ శాఖతో అనుసంధానం అయిన తర్వాత కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు.

వచ్చే నెల లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమించాల్సి ఉందన్నారు. కొత్త లేఔట్లకు 12 మీటర్ల వెడల్పుతో మేర రహదారులను నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలించిన తర్వాత రహదారులు వెడల్పు కచ్చితంగా 9 మీటర్లు ఉండేలా నిబంధనలను రూపొందిస్తున్నామన్నారు. కొత్త విధానం అమలులోకి వస్తే భవన నిర్మాణ అనుమతులు సులభతరం అవుతాయన్నారు. కొత్త విధానంపై బిల్డర్లు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.