Leading News Portal in Telugu

AP Government orders on utilization of funds given by World Bank and ADB for Amaravati


  • అమరావతి నిర్మాణం కోసం పడిన ముందడుగు
  • బ్యాంకుల ద్వారా వచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు
Amaravathi: అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు

Amaravathi: ఏపీ రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ది, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రూపాయల మేర రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్డిఏను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రధాన రహదారులు, డక్ట్‌లు, డ్రెయిన్‌లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్ లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రాజధాని సుస్థిర అభివృద్ధి కి ఏపీ సీఆర్డిఏ సమర్పించిన ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని వెల్లడించింది. ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపింది. మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్డిఏ కమిషనర్‌కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అభివృద్ధి , నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ అధీనం లోనే ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు ఎల్లుండి ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.