Leading News Portal in Telugu

AP Assembly Speaker Ayyanna Patrudu and CM Chandrababu key comments in BAC Meeting


  • ముగిసిన బీఏసీ సమావేశం..

  • ఈ నెల 22వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామన్న స్పీకర్..

  • ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవన్న సీఎం..
AP Assembly Sessions 2024: ముగిసిన బీఏసీ.. ఎవరికోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు..!

AP Assembly Sessions 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు.. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. అయితే, అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే బీఏసీ సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు.. రేపు బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయి.. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుందన్నారు.. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.

ఇక, బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు అని స్పష్టం చేశారు.. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యతగా పేర్కొన్న ఆయన.. 1995లో తెల్లవారుజామున 4 గంటలకు ముందురోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి అని గుర్తుచేసుకున్నారు.. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరు అయ్యే విధంగా సీరియస్ గా తీసుకోవాలన్నారు.. చీఫ్ విప్, విప్ లను రేపు ఖరారు చేస్తాం అని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. జనసేన పక్షనేతగా సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తాను స్పీకర్ గా ఉన్న సమయంలో సభలో చంద్రబాబు హుందాతనం చూశానన్నారు.. ఇక, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ జరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ప్రజాధనం దుర్వినియోగంతో కట్టిన ఋషికొండపై చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యేలంతా ఓరోజు ఋషికొండ పర్యటన చేపట్టాలని బీఏసీ సమావేశంలో కోరారు విష్ణుకుమార్ రాజు..