- కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం తవ్వకాలపై కీలక ప్రకటన..
-
పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియ ఆపేయాలని సీఎం ఆదేశాలు.. -
ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు.. -
ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్..

Uranium Mining: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీని కోసం బోర్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు.. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దు అంటూ ఉద్యమించారు.. అయితే, ఈ నేపథ్యంలో కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం పరీక్షలు, తవ్వకాలపై కీలక ప్రకటన చేశారు కలెక్టర్ రంజిత్ బాషా.. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు.. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు.. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కలెక్టర్ రంజిత్ బాషా..
కాగా, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలు చేస్తామని, బోర్లకు అనుమతి ఇచ్చారు.. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కప్పట్రాళ్ల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాళ్ళ, చెల్లెల చిలిమిలా, బేతపల్లి గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నిరసన ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.. వీరికి విపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నాయి.. చివరకు ప్రభుత్వమే కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు జరపడం లేదంటూ ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..