Leading News Portal in Telugu

AP Assembly Speaker Ayyanna Patrudu at MLAs and MLAs Workshop


  • నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను..

  • కానీ.. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్న స్పీకర్..

  • అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి..

  • సభలో ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో తెలుసుకోవాలి..
Speaker Ayyanna Patrudu: 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

Speaker Ayyanna Patrudu: నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను.. కానీ, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. అసెంబ్లీలో ఈ రోజు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వర్క్ షాప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని వెల్లడించారు.. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. రోజుకి పది ప్రశ్నలకే సమయం సరిపోతుంది.. కానీ, జీరో హవర్స్‌లో హ్యాండ్ రైజ్ చేస్తే వారికి నేను అవకాశం ఇస్తాను అని పేర్కొన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు..

ఇక, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలన్నారు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని సూచించారు. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలని సూచించారు. వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చాలామంది కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలుగా వచ్చారు. టీడీపీ నుండి 61 మంది, జనసేన నుండి 15 మంది, బీజేపీ నుండి నలుగురు, వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని తెలిపారు.. మొత్తం 84 మంది కొత్తవారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 30 మంది టీడీపీ నుంచి ఉన్నారని వెల్లడించారు.. ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసెడింగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో వచ్చేవి. ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యే దాకా టెక్నాలజీ వచ్చిందన్నారు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లం సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తాం. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయన్నారు.. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు.. వాళ్లకు బాధ్యత లేదు.. కానీ, మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం.. ప్రజలకు ఏం అవసరమో.. ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అన్నారు. అసెంబ్లీకి మేం పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు.. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరు. గతంలో అదే జరిగిందని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు..