Cyber Criminals stole Rs. 46 lakhs by saying that they Had deposited money by mistake in Eluru District
- రూ.20 వేలు పంపించి రూ.46 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Cyber Crime: పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని అశోక్‌నగర్‌కు చెందిన శేషగిరి ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తులు రూ.20 వేలు పంపారు. పొరపాటున డబ్బులు జమ చేశామని.. తిరిగి తమ ఖాతాకు పంపాలని ప్రాధేయపడి అడిగారు. ఆ మాటలు నమ్మిన శేషగిరి తిరిగి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించారు. ఈ క్రమంలోనే శేషగిరి ఈ నెల 10న తన అకౌంట్ పరిశీలించగా.. రూ.46 లక్షలు విత్‌డ్రా అయినట్లు చూపించింది. వెంటనే శేషగిరి పోలీసులను ఆశ్రయించారు. రూ.20 వేలు పంపగానే రూ.46 లక్షలు దోచేశారని తెలిసింది. ఏలూరు టూ టౌన్ సీఐ వైవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.