Leading News Portal in Telugu

YSRCP members walk out From Legislative Council in Andhra Pradesh


  • ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్
  • పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం
YSRCP: శాసన మండలి నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్!

YSRCP: ఏపీ శాసన మండలి నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా డయేరియా ప్రబలిందని బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఐదు నెలల కాలంలో ఎందుకు తాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని అడిగారు. బొత్స వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ళలో పంచాయితీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డయేరియా భాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూనే నియోజకవర్గంలో పరిస్థితులపై బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనే చెప్పారని మంత్రి సత్య కుమార్ వ్యాఖ్యానించారు. బొత్స ఆవేదన చూస్తుంటే ముచ్చటేస్తుందని మంత్రి సత్య కుమార్ అన్నారు. సత్యకుమార్ పైశాచిక ఆనందం పొందుతున్నారని బొత్స పేర్కొన్నారు. బొత్స ఆవేదన పైనే తానే స్పందించానని ఆ వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటానని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రశ్నపై చర్చ ముగిసిందని మండలి ఛైర్మన్ ప్రకటించగా.. కొద్దిసేపు పోడియం ముందు వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవటంతో పాటు మంత్రి సమాధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు కొద్దిసేపు వాకౌట్ చేశారు.