చంద్రబాబు విజన్‌తోనే తెలంగాణకు ఆదాయం
విజయవాడ: తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి నాడు చంద్రబాబు విజన్ 2020 కార్యక్రమమే కారణమని తెతెదేపా నేత ఎల్. రమణ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న తెదేపా మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పెత్తందారీ వ్యవస్థను పెకలించి వేసే సత్తా కేవలం తెదేపాకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్న వ్యక్తి చంద్రబాబునాయుడే అని అన్నారు.
బడుగుబలహీన వర్గాల వారికి అవకాశాలు ఇస్తున్న పార్టీ తెదేపానే అని తెలిపారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలను తెదేపాకు గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. ఆస్తులు, ఆదాయం తమకు అవసరం లేదన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా చంద్రబాబు వివిధ రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ను అగ్రస్థానంలోకి తీసుకువెళుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగింది అంటే అది తెదేపా పాలన వల్లే సాధ్యమైందన్నారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌కు మద్దతుగా పోరాడుతామన్నారు. తెలంగాణలో తెదేపా అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో అత్యధికంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలే ఉంటారని రమణ ప్రకటించారు. వచ్చే మహానాడులో తెలంగాణలో విజయపతాకం ఎగురవేసి తెదేపా ప్రతినిధులతో సహా హాజరవుతానని ఆయన ప్రకటించారు.