Leading News Portal in Telugu

కేంద్ర ప్రభుత్వమంటే తెదేపాకు భయం!

ఆముదాలవలస: భయపడేవాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు ఏ న్యాయం జరుగుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ ప్రశ్నించారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెదేపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

‘‘ఓటుకు నోటు కేసులో భయపడి ఇంతకాలం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోయారు. అందుకే మీరు ప్రత్యేక హోదా కోసం చేయాల్సిన పోరాటాన్ని నీరుగార్చేశారు. ఈరోజు పవన్‌కల్యాణ్‌, జనసేన, జనసైనికులు రోడ్లపైకి వస్తున్నారంటే మీరు చూపిన నిర్లక్ష్యమే కారణం.

మరోసారి ఏపీ ప్రజలు వంచనకు గురికాకుండా మేము నిరసన కవాతు చేస్తున్నాం. పలాసలో నేనుంటున్న గెస్ట్‌ హౌస్‌లో కరెంట్‌ తీయించి జనసేన కార్యకర్తల పేరు చెప్పి నాపై దాడి చేయించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండటానికి జనసేన, జనసైనికులే కారణం. జనసేన జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తను మంత్రులు, ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు. దయచేసి మా జనసేన సైనికులను వేధించకండి. రాబోయేది మా కాలం. యువతరం కొత్త మార్పును కోరుకుంటోంది.

మీరు మమ్మల్ని వేధిస్తే చేతులు కట్టుకుని కూర్చునేవాళ్లం కాదు. నవతరానిది ఉప్పొంగే రక్తం. మీరందరూ గ్రామగ్రామాలకు వెళ్లి అందరికీ పార్టీ సిద్ధాంతాలను చెప్పండి. మీరు నన్ను సీఎం అంటే పనులు జరగవు. జనసేన సిద్ధాంతాలను, భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. మనది దిగువ మధ్యతరగతి పార్టీ, చెమటోడ్చి పనిచేసే పార్టీ అని ప్రతి ఒక్కరికీ చెప్పండి. ఇక ముందు కూడా మీ ప్రేమ, ఆదారాభిమానులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.