Leading News Portal in Telugu

ఏపీకి కొత్త కష్టం… పడిపోయిన విద్యుత్ వినియోగం

అసలే లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీకి మరో కష్టాలు వచ్చిపడుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఊహించని విధంగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 120 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. ఈ పరిణామంపై విద్యుత్‌ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం వీచిన గాలులు, వర్షానికి పలు జిల్లాల్లో భారీగా విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా రైతులు కూడా వ్యవసాయ విద్యుత్‌ ఉపయోగించుకోలేదు.

ఏప్రిల్‌లో సాధారణంగా 210 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉంటుందని ఈ ఏడాది అంచనా వేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ తగ్గిపోయి రోజుకు 150 మిలియన్‌ యూనిట్లు నమోదవుతోంది. గాలి దుమ్ము వల్ల ఇది 120 మిలియన్‌ యూనిట్లకు చేరింది.ఇలా విద్యుత్‌ డిమాండ్‌ పడిపోవడం, తిరిగి కొన్ని గంటల్లో పుంజుకోవడం వల్ల గ్రిడ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకూ కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడం కష్టంగా మారినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.