Leading News Portal in Telugu

మారుతీ ‘ఇగ్నిస్‌’ నిలిపివేత, భారీ డిస్కౌంట్లు

మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా విక్రయాలు నమోదు చేస్తున్న మారుతీ, తన మోడల్స్‌లో ఒకటి మార్కెట్‌లో కస్టమర్లను చేరుకోలేకపోతుందని గుర్తించింది. అది ఇగ్నిస్‌ డీజిల్‌ వేరియంట్‌గా తెలిపింది. కస్టమర్ల నుంచి ఈ వాహనానికి తక్కువ డిమాండ్‌ వస్తుండటంతో, ఇగ్నిస్‌ డీజిల్‌ వేరియంట్‌ను ఆపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇగ్నిస్‌ డీజిల్‌ ఉత్పత్తిని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్‌డీటీవీ కారన్‌అండ్‌బైక్‌ రిపోర్టు ప్రకారం, ఇగ్నిస్‌ డీజిల్‌కు సంబంధించి ఎలాంటి బుకింగ్స్‌ను తాము తీసుకోవడం లేదని ముంబైకి చెందిన ఓ డీలర్‌ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న డీలర్స్‌ కూడా ఇగ్నిస్‌ మోడల్‌ను నిలిపివేసినట్టు పేర్కొన్నారు.

ఫీచర్ల పరంగా చూసుకుంటే, ఆ కారు ధర చాలా ఎక్కువని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారు అసలు ధర సుమారు 8 లక్షల రూపాయలుగా ఉంది. ఎవరైతే కస్టమర్లు పెట్రోల్‌ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి అన్ని ఫీచర్లు కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. కంపెనీ ఇటీవలే తన కొత్త స్విఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. మారుతీ సుజుకీ చెందిన స్విఫ్ట్‌, ఇగ్నిస్‌ రెండు మోడల్స్‌ కూడా ఒకే విధమైన ధరను కలిగి ఉన్నాయి. మూడో తరానికి చెందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ వేగవంతమైన కారుగా పేరులోకి వచ్చింది. ఇప్పటికే ఇది లక్ష యూనిట్‌ విక్రయాలను క్రాస్‌ చేసింది. అయితే ఇగ్నిస్‌ కేవలం నెలవారీ 4500 యూనిట్‌ విక్రయాలను మాత్రమే నమోదు చేసింది.

ఇగ్నిస్‌ను ప్రస్తుతం నిలిపివేయడంతో, ఇప్పటికే ఉన్న స్టాక్‌పై డీలర్స్‌ బంపర్‌ ఆఫర్లు ప్రకటించారు. న్యూఢిల్లీలో ఇగ్నిస్‌పై 70 వేల రూపాయల వరకు ప్రయోజనాలను మారుతీ సుజుకీ డీలర్లు ఆఫర్‌ చేస్తున్నారు. మాన్యువల్‌ వెర్షన్‌ 35 వేల రూపాయల నగదు డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. ఏఎంటీపై కూడా 40 వేల రూపాయల డిస్కౌంట్‌ లభ్యమవుతుంది. 25 వేల రూపాయల ఎక్స్చేంజ్‌ బోనస్‌, రూ.3100 కార్పొరేట్‌ బోనస్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. అయితే డిస్కౌంట్లు, ఆఫర్లు డీలర్‌షిప్‌కు డీలర్‌షిప్‌కు మధ్య తేడా ఉంటాయి. ఇగ్నిస్‌ డీజిల్‌ బేస్‌ వేరియంట్‌ ధర, కొన్ని ప్రత్యర్థ వాహనాల ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి.