Leading News Portal in Telugu

Retail Inflation Data: 15 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. జూలైలో 7.44శాతం


Retail Inflation Data: టమాటాలతో సహా ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర పెరుగుదల కారణంగా జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ లాంగ్ జంప్ చేసింది.. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. సీపీఐ ద్రవ్యోల్బణం జూలైలో 7.44 శాతంగా ఉంది. ఇది జూన్ 2023లో 4.81 శాతంగా ఉంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్లాబ్‌ను దాటింది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.63 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 7.20 శాతంగా ఉంది.

ఖరీదైన ఆహార పదార్థాలు
రిటైల్ ద్రవ్యోల్బణం రేటుకు సంబంధించి గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల ఉంది. జులైలో ఆహార ద్రవ్యోల్బణం 11.51 శాతంగా ఉండగా, జూన్‌లో 4.49 శాతంగా ఉంది. అంటే ఒక్క నెలలోనే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అక్టోబర్ 2020 తర్వాత ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఇదే అత్యధిక స్థాయి.

గణనీయంగా పెరిగిన కూరగాయల ద్రవ్యోల్బణం
జూలై నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 37.34 శాతంగా ఉంది. ఇది జూన్ 2023లో -0.93 శాతంగా ఉంది. అంటే, ఒక నెలలో ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం రేటు 38 శాతానికి పైగా పెరిగింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం జూన్‌లో 10.53 శాతంగా ఉన్న 13.27 శాతంగా ఉంది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం జూన్‌లో 19.19 శాతంగా ఉన్న 21.53 శాతంగా ఉంది. పాలు, దాని సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 8.56 శాతంగా ఉన్న 8.34 శాతంగా ఉంది. ఆహార ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 12.71 శాతంగా ఉన్న 13.04 శాతంగా ఉంది. చమురు, కొవ్వుల ద్రవ్యోల్బణం జూన్‌లో -18.12 శాతం, -16.80 శాతంగా ఉంది.

గత ఏడాది మే 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. ఆ తర్వాత ఆర్బీఐ రెపో రేటును పెంచడం ప్రారంభించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచారు. మే 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.25 శాతానికి తగ్గినప్పుడు ఖరీదైన ఈఎంఐ నుండి ఉపశమనం లభిస్తుందనే ఆశ ఉంది. అయితే మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7 శాతం దాటింది. దీంతో ఖరీదైన ఈఎంఐ నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ ప్రస్తుతానికి ముగిసినట్లే. ఎందుకంటే ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంది.