Leading News Portal in Telugu

Mahindra OJA: నాలుగు చక్రాలతో నడిచే తేలికపాటి ట్రాక్టర్లను ఆవిష్కరించిన మహీంద్రా గ్రూప్


Mahindra OJA: భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మనదేశ వ్యవసాయంలో ట్రాక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇక దేశీయంగా ట్రాక్టర్ల వ్యాపారంలో మహీంద్రా గ్రూప్ పెద్దది. ఎంతో నాణ్యమైన ట్రాక్టర్లను అందించడంలో మహీంద్ర గ్రూప్ ముందుంటుంది. నమ్మకానికి మారు పేరు ఈ బ్రాండ్. గట్టిగా, కఠినంగా ఉండే వ్యవసాయం క్షేత్రాల్లో సైతం ఈ ట్రాకర్లు మెరుగైన పనితీరుని కనబరుస్తాయి. ఈ ట్రాక్టర్లు ఉత్తమంగా పనిచేస్తామని ఎంతో మంది రైతన్నలు సైతం చెబుతూ ఉంటారు. ఇక తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహీంద్రా గ్రూప్ అతి పెద్ద ప్రకటన చేసింది. ‘ఫ్యూచర్-రెడీ’ ట్రాక్టర్ల శ్రేణిని ఆవిష్కరించింది. వీటికి మహీంద్రా ఓజా అని పేరుపెట్టింది. ఈ కార్యక్రమం దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగింది.

ఈ ట్రాక్టర్లలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇవి నాలుగు చక్రాలతో నడిచే లైట్ వెయిట్ ట్రాక్టర్లు. దీనిని ట్రాక్టర్ టెక్నాలజీలోనే నూతన ఆవిష్కరణగా పేర్కొనవచ్చు. డిజైన్ & ఇంజనీరింగ్‌లో ట్రాన్స్‌ఫార్మేటివ్ మార్పును తీసుకొస్తూ 4WD స్టాండర్డ్‌తో 7 కొత్త ట్రాక్టర్ల మోడళ్లను విడుదల చేసింది మహీంద్ర గ్రూప్. కాంపాక్ట్ , స్మాల్ యుటిలిటీ ప్లాట్‌ఫారమ్‌లలో భారత మార్కెట్ కోసం వీటిని రూపొందించింది. రైతులు ఎక్కువ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కొత్త OJA ట్రాక్టర్ల శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా & మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా వెల్లడించారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు.

వీటి ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే వీటిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది. PROJA, MYOJA, ROBOJA అనే మూడు అడ్వాన్స్ టెక్నాలజీలతో లైట్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఈ మోడల్‌లు 20HP-40HP పవర్ కలిగి ఉంటాయి. ఏషియన్, యూరోపియన్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు ఇవి కంపెనీకి ఉపయోగపడతాయని మెుబిలిటీ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కొత్త మోడల్ ట్రాక్టర్లు ప్రపంచంలో పావు వంతు అంటే 25 శాతం మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.