Leading News Portal in Telugu

Vodafone Idea: అప్పుల్లో వొడాఫోన్ ఐడియా.. చెల్లిస్తాం టైం ఇవ్వమన్న కంపెనీ


Vodafone Idea: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ వేలం విడతగా సుమారు రూ.1,680 కోట్లు చెల్లించేందుకు మరో 30 రోజుల గడువు కోరినట్లు వొడాఫోన్ ఐడియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వోడాఫోన్ ఐడియా ఈ మొత్తాన్ని ఆగస్టు 17 గురువారం నాటికి చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా టెలికాం శాఖకు (DoT) తిరిగి చెల్లించాలని కంపెనీ ప్రతిపాదించింది. వోడాఫోన్ ఐడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మూర్తి గ్వాస్ మాట్లాడుతూ.. 2022 వేలం కోసం స్పెక్ట్రమ్ వేలం వాయిదా రూ. 1,680 కోట్లను చెల్లించేందుకు ఈ 17తో గడువు ముగుస్తుంది. కానీ సంస్థలో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా వడ్డీతో సహా 30 రోజుల్లోపు చెల్లించేందుకు NIA నిబంధనల ప్రకారం చెల్లిస్తామని DoTకి ఒక లేఖను సమర్పించామన్నారు.

జూలై 2022 స్పెక్ట్రమ్ వేలంలో కంపెనీ మిడ్-బ్యాండ్ (3300 MHz)లో 5G స్పెక్ట్రమ్, 26 GHz బ్యాండ్‌లో మిల్లీమీటర్ వేవ్‌ను కూడా కొనుగోలు చేసింది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.7,840 కోట్లకు పెరిగింది. జూన్ 2022 త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం స్వల్పంగా 2.3 శాతం పెరిగి రూ.10,406.8 కోట్ల నుండి రూ. 10,655.5 కోట్లకు చేరుకుంది. జూన్ 30, 2023 నాటికి మొత్తం స్థూల రుణం (లీజు బాధ్యతలు మినహాయించి, చెల్లించాల్సిన వడ్డీతో సహా) రూ. 2,11,760 కోట్లు. ఇందులో వాయిదా పడిన స్పెక్ట్రమ్ చెల్లింపు బాధ్యతలు రూ. 1,33,740 కోట్లు, రూ. 66,860 కోట్ల AGR(adjusted gross revenue) బాధ్యతలు ఉన్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రుణం రూ.9,500 కోట్లు, రూ.250 కోట్ల నగదు. రుణ సాధనాల ద్వారా సేకరించిన నిధులు రూ.1,660 కోట్లు. వాటితో నికర అప్పు రూ.2,11,510 కోట్లుగా ఉంది.