Leading News Portal in Telugu

Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేస్తున్నారా? సిబిల్ పై ప్రభావం పక్కా


ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చాక ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయాల్సిన అవసరం దాదాపు తగ్గిపోయింది. దీంతో చాలా మంది డెబిట్ కార్డులను వాడటం మానేశారు. ఏదో అప్పుడప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే డెబిట్ కార్డు వాడకం ఎంత తగ్గిందో కెడ్రిట్ కార్డు వినియోగం అంత పెరిగింది. బ్యాంక్ లు కస్టమర్లను ఆకర్షించేలా వీటిపై అనేక ఆఫర్లను ఇవ్వడం కూడా వీటి వినియోగానికి కారమవుతున్నాయి. ఫైనాన్షియల్‌ ఫ్లెక్సిబిలిటీ, స్పెండింగ్‌ని ట్రాక్‌ చేయడంలో కెడ్రిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

తమ నెలవారీ ఖర్చులకు వీటిని చాలా మంది వినియోగిస్తున్నారు. కొందరైతే తమ ఖర్చుల కోసం పూర్తిగా క్రెడిట్ లిమిట్ మొత్తం ఉపయోగిస్తుంటారు. అయితే జీతం రాగానే మొత్తం బకాయిని కట్టేసి మళ్లీ క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా పదేపదే చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక క్రమశిక్షణ తప్పే ప్రమాదం ఉంది. మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇది మీ సిబిల్ స్కోర్ పై కూడా ప్రభావం చూపిందని గుర్తుంచుకోండి

క్రెడిట్ యుటిలైజేషన్ రేట్

క్రెడిట్ కార్డు స్కోర్ పైనే బ్యాంక్ ల నుంచి పొందే రుణాలు, వాటిపై విధించే వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. అయితే మంచి సిబిల్ స్కోర్ కోసం హెల్తీ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ మెయింటెన్(CUR) చేయాలి. అసలు ఏంటి ఈ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ అనుకుంటున్నారా? మనం క్రెడిట్ కార్డును ఎలా, ఎంత వరకు ఉపయోగిస్తున్నామనన్నది తెలిపేదే ఈ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్. సాధారణంగా ఈ రేటు మనకు ఇచ్చిన క్రెడిట్ కార్డు స్మెండింగ్ లిమిట్ లో 30 శాతం కంటే తక్కువగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక CUR అంటే అర్థం ఏంటంటే మీరు క్రెడిట్ లిమిట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం.

ఇలాంటి సందర్భంలో మీరు బకాయిలను డ్యూ డేట్ కంటే ముందే చెల్లిస్తున్నప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగానే ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు లోన్ పొందటం కష్టం కావడమే కాకుండా మీ కార్డు లిమిట్ పెంచుకొనే అవకాశం కూడా ఉండదు. అంతేకాకండా మీరు ఒక్కనెల బిల్లును చెల్లించడంలో ఆలస్యం చేసిన అది ఆర్థికంగా భారంగా మారొచ్చు. మీరు మినిమమ్ బ్యాలెన్స్ కట్టినప్పటికీ మీరు కట్టాల్సిన బకాయిలో తేడా రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి కార్డు ఉపయోగించి ఖర్చు చేసే ముందే ఆలోచించండి.