Pulses And Oilseed Prices: ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. బలహీన రుతుపవనాల ట్రెండ్ సెప్టెంబర్‌లో కూడా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీని వెనుక ఎల్‌నినో కారణం అని చెబుతున్నారు. తక్కువ వర్షం కారణంగా పప్పులు, నూనె గింజల ధరలు పెరగవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల నాట్లు దాదాపు పూర్తయినప్పటికీ, రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల పంట దిగుబడి దెబ్బతినే అవకాశం ఉంది.
చాలా ప్రాంతాల్లో తగ్గిన వర్షపాతం
పప్పుధాన్యాలు, నూనె గింజలు విత్తిన తరువాత ఇప్పుడు ఈ పంట పుష్పించే దశలో ఉంది. వాటికి ఎక్కువ నీరు అవసరం. బలహీనమైన రుతుపవనాలు ఈ పంటల దిగుబడిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. వాతావరణ శాఖ ప్రకారం సోమవారం వరకు భారతదేశంలో రుతుపవనాల లాగ్ పీరియడ్ సగటు 92 శాతం ఉంది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మాత్రమే గతేడాది కంటే 6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు మధ్య భాగంలో 7 శాతం, తూర్పు ఉత్తర భారతదేశంలో 15 శాతం, దక్షిణ ప్రాంతంలో 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత సంవత్సరాలతో పోల్చితే ఆగస్టు నెలలో దేశం మొత్తం 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు. సెప్టెంబరులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసినా ఇంత భారీ లోటును తీర్చడం కష్టమే.
ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు, సెప్టెంబరులో కురిసే వర్షాలపైనే పంటల దిగుబడి ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల్లో తక్కువ వర్షపాతం కారణంగా దేశంలో వరి, చెరకు, పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి దెబ్బతింటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరుగుదల నమోదైంది. అది 330.5 మిలియన్ టన్నులకు (MT) పెరిగింది. ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 332 మిలియన్ టన్నులుగా నిర్ణయించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యానికి పెద్ద దెబ్బే. దాని ప్రభావం పప్పులు, నూనె గింజల ధరలపై కూడా కనిపిస్తుంది.