RBI Governor Sakstikanta Das: భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. మొన్నటికి మొన్న చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇండియా గర్వించదగ్గ విషయం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023’లో శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్ లభించింది. అయితే ముగ్గురికి ఈ ర్యాంకు రాగా అందులో శక్తి కాంత్ మొదటి స్థానంలో నిలిచారు.
రెండో స్థానంలో స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, మూడో స్థానంలో వియత్నాం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎన్గుయెన్ థి హాంగ్ నిలిచారు. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్లను కేటాయించారు. అద్భుతమైన పనితీరుకు ఏ, పనితీరు అస్సలు బాగోని వారికి ఎఫ్ రేటింగ్ ఇచ్చారు. ఇక శక్తి కాంత దాస్ కు‘ఏ+’ ర్యాంకు వచ్చిన విషయాన్ని ఆర్బీఐ తన ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఆయనకు ఈ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని ట్వీ్ట్ చేసింది. ఇక దీనికి సంబంధించి పలువురు శక్తికాంత్ దాస్ కు శుభాకాంక్షలు చెబుతుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. దేశం గర్వించదగ్గ నిమిషం అంటూ శక్తికాంత్ ను కొనియాడుతూ ట్వీట్ చేశారు. “ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు అభినందనలు. భారతదేశం గర్వించదగ్గ నిమిషం ఇది. శక్తికాంత దాస్ కు లభించిన ఘనత ప్రపంచ వేదికపై మన దేశ ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తోంది. శక్తికాంత దాస్ అంకితభావం, దార్శనికత దేశ పురోగతి తీరును మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నాను” అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక 1994 నుంచి ప్రతి ఏటా గ్లోబల్ ఫైనాన్స్ తన రిపోర్టు కార్డును ప్రకటిస్తోంది.