Fortune 500 List: దేశంలోని ఇద్దరు అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల ఆస్తి, నికర విలువ గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదానీ గ్రూప్‌కు చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి.
ఆసియాలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ నికర విలువ గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం రూ.65,000 కోట్లు పెరిగిందని ఫార్చ్యూన్ 500 నివేదిక తెలుపుతోంది. ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తులు రూ. 8.19 లక్షల కోట్లుగా అంచనా వేయబడ్డాయి. ఇది గతేడాది కంటే 9 శాతం ఎక్కువ. గతేడాది ముఖేష్ అంబానీ మొత్తం నికర విలువ రూ.7.54 లక్షల కోట్లు. ఈ సంవత్సరం అతని సంపద పెరిగింది. అతను ప్రపంచంలోని అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
మరో భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ గతేడాదితో పోలిస్తే రూ.5 లక్షల కోట్లు తగ్గింది. దాని కారణంగా అతను ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో వెనుకబడ్డాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ జాబితాలో కూడా ఆయన స్థానం దిగజారింది. గౌతమ్ అదానీ సంపద గతేడాదితో పోలిస్తే 49 శాతం భారీగా క్షీణించి రూ.5.24 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో గౌతమ్ అదానీ భారతదేశ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే జనవరి 24న వచ్చిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగింది. దీని తరువాత గౌతమ్ అదానీ నికర విలువ, ఆస్తులలో పెద్ద క్షీణత ప్రారంభం అయింది.
ఫార్చ్యూన్ 500 నివేదికలో దేశంలోని 157 మంది సంపన్న వ్యాపారవేత్తల సంపద 133 శాతం పెరిగి రూ.69.30 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని 10 మంది ధనవంతుల వద్ద మొత్తం సంపదలో 41.65 శాతం ఉంది.