బంగారు ఆభరణాలు ప్రతి మహిళకు గర్వకారణం. బంగారం యొక్క ప్రకాశానికి దాని స్వంత ఆకర్షణ ఉంది. కానీ కాలక్రమేణా వాటిని ఉపయోగించడంతో బంగారు ఆభరణాల మెరుపు తగ్గుతాయి. అంతేకాకుండా వాటి రంగు మారుతాయి. అందువల్ల అది బంగారమా.. కాదా.. అని గుర్తించలేము. ఇలాంటి పరిస్థితుల్లో మగువలు పాత బంగారు ఆభరణాలను అమ్మి కొత్త బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు పాత బంగారాన్ని స్వర్ణకారుని వద్దకు తీసుకెళ్లి శుభ్రం చేయించడానికి తీసుకెళ్తే.. కొంత బంగారాన్ని స్వాహా చేస్తున్నారు. దీని వల్ల నష్టపోక తప్పదు. అయితే ఇలా కాకుండా.. ఇంటి వద్దే మీ పాత బంగారు ఆభరణాలకు కొత్త మెరుపును ఇవ్వవచ్చు. కొన్ని హోం రెమెడీస్ వల్ల బంగారం నిగనిగ మెరుస్తుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సబ్బు నీటితో శుభ్రం చేయండి
ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు, కొన్ని చుక్కల షాంపూ లేదా సబ్బు కలపండి. ఆపై ఆభరణాలను అందులో ముంచి.. బ్రష్‌తో సున్నితంగా శుభ్రం చేయండి. తర్వాత చల్లటి నీటితో కడిగి మెత్తని గుడ్డతో ఆరబెట్టాలి.
టూత్ పేస్టు ఉపయోగం
బంగారాన్ని పాలిష్ చేయడంలో టూత్‌పేస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఆభరణాలపై టూత్‌పేస్ట్ రాసి బ్రష్‌తో మెల్లగా శుభ్రం చేయాలి. తర్వాత నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత బంగారంలో కొత్త మెరుపు కనిపిస్తుంది.
సోడా, ఉప్పు మిశ్రమం
ఒక గిన్నెలో వేడినీరు, ఒక టీస్పూన్ చక్కటి సోడా.. అర టీస్పూన్ ఉప్పు వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆభరణాలను అందులో 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత కడిగి ఆరబెట్టాలి.
అమ్మోనియాతో శుభ్రం చేయండి
అమ్మోనియా బంగారాన్ని పాలిష్ చేయడంలో సహాయపడుతుంది. నీటిలో కొంచెం అమ్మోనియా కలపండి. తర్వాత బంగారు ఆభరణాలను అందులో ముంచండి. కొన్ని నిమిషాల తర్వాత బయటకు తీసి ఆరబెట్టాలి.
బేకింగ్ సోడా, వెనిగర్ తో శుభ్రం చేయండి
ఒక గిన్నెలో అరకప్పు వెనిగర్, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలపండి. మీ బంగారు ఆభరణాలను ఈ మిశ్రమంలో 2-3 గంటల పాటు ముంచండి. తర్వాత చల్లటి నీటితో కడిగి మెత్తని గుడ్డతో ఆరబెట్టాలి. మీ బంగారు ఆభరణాలు మళ్లీ కొత్తగా మెరుస్తున్నట్లు మీకు కనిపిస్తాయి. ఈ పరిష్కారం చౌకగా, సులభంగా మాత్రమే కాకుండా.. బంగారం షైన్ గా చాలారోజులు ఉంటుంది.