Leading News Portal in Telugu

Online Shopping: దూసుకుపోతున్న ఆన్ లైన్ షాపింగ్.. 90వేల కోట్ల వ్యాపారం..!


కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో.. వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే రాబోయే పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ గ్రాస్‌ మెర్చండైజ్‌ వ్యాల్యూ 18 నుంచి 29 శాతం వృద్దితో దాదాపు రూ.90 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ అంచనా వేసింది.

ఆయా ఈ- కామర్స్‌ కంపెనీలు నిర్వహించే ఫెస్టివల్‌ సేల్స్‌ అధికారిక తేదీలు ఇంకా రిలీజ్ కానప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలు అక్టోబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ-కామర్స్ విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించినప్పటికీ.. ఈ రంగం గత రెండు త్రైమాసికాల్లో నామ మాత్రపు ఫలితాలు వచ్చాయి.

జనవరి-జూలై 2023లో జీఎంవీ గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 10 శాతం మేర పెరిగింది. ఏది ఏమైనప్పటికీ, కొవిడ్‌ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో రాబోయే పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ విక్రయాలు మరింత పేరిగే అవకాశం ఉందని నివేదికలో వెల్లడైంది. ఈ పండగ అమ్మకాల్లో దాదాపు 14 కోట్ల మంది పాల్గొనవచ్చని అంచనా. వీరు కనీసం ఒక్కసారి అయినా కొనుగోళ్లు చేసే ఛాన్స్ ఉందిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. భారత ఈ-కామర్స్‌ సంస్థలు ప్రత్యేక పండగ విక్రయాలు ప్రారంభించి ఈ ఏడాదికి పదేళ్లు పూర్తి అవుతుంది.

దీంతో భారత ఈ-కామర్స్‌ స్థూల మర్చండైజ్‌ విలువ దాదాపు 20 రెట్లు వృద్ధి చెందింది. వార్షిక కొనుగోలుదార్ల సంఖ్య దాదాపు 15 రెట్లు పెరిగింది. 2014లో ఈ-కామర్స్‌ పరిశ్రమ పూర్తి ఏడాదిలో రూ.27 వేల కోట్లు జీఎంవీ నమోదు చేయగా.. 2023లో దాదాపు రూ.5.25 లక్షల కోట్ల జీఎంవీకి చేరే ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, గృహ, ఫ్యాషన్, సాధారణ వస్తువుల అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉందని రెడ్‌సీర్‌ నివేదిక తెలిపింది.