Leading News Portal in Telugu

Indian Economy By 2027: ఆ విషయంలో జర్మనీ-జపాన్‌ను అధిగమించనున్న భారత్


Indian Economy By 2027: ఐదు ట్రిలియన్ డాలర్లు… ఆర్థిక వ్యవస్థ పరంగా ఇది ఒక మైలురాయి. దీనిని ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి. భారతదేశం ఈ మైలురాయిని సాధించడానికి చాలా దగ్గరగా ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొదలుకొని, విదేశాలలో చాలా మంది పారిశ్రామికవేత్తలు, ఏజెన్సీలు దీనిపై చర్చించారు. ఈ మైలురాయిని భారతదేశం ఎప్పుడు అధిగమించనుందో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ చెప్పారు. మార్కెట్ మారకపు ధరల ఆధారంగా భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డి పాత్ర చెప్పారు. 2027 నాటికి భారతదేశం ఈ ఘనతను సాధిస్తుందని, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టాత్మక క్లబ్‌లోకి ప్రవేశించడంతోపాటు, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీని పరిమాణం 25 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. దాదాపు 18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4 ట్రిలియన్ డాలర్ల కంటే కొంచెం ఎక్కువ. అయితే భారతదేశ జిడిపి పరిమాణం ప్రస్తుతం 3.5 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న వేళ, భారత ఆర్థిక వృద్ధి రేటు రెండంకెలకు చేరువలో ఉంది. జూన్ త్రైమాసికంలో భారతదేశ అధికారిక ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. రాబోయే త్రైమాసికాల్లో కూడా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. మరోవైపు, జర్మనీ మాంద్యం పట్టులో ఉంది. జపాన్ ఆర్థిక వృద్ధి రేటు చాలా నిరాడంబరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మాటలు తప్పుగా అనిపించడం లేదు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, కొనుగోలు శక్తి ఆధారంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2027 నాటికి మార్కెట్ మారకపు రేట్ల ఆధారంగా భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది జీడీపీ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్లు దాటుతుంది.