Leading News Portal in Telugu

iPhone 15: ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో కొత్త ఐఫోన్ మీ ఇంటికి వస్తుంది.. ఎలాగంటే?


iPhone 15: బ్లింకిట్ కిరాణా, ఇంటి వస్తువులు, ఆహార ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేసే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఐఫోన్లకు కూడా డెలివరీ చేస్తోంది. iPhone 15, iPhone 15 Plus కోసం ఆర్డర్‌ను స్వీకరించిన 10 నిమిషాల్లో కస్టమర్‌కు డెలివరీ ఇస్తుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) ఢిల్లీ, ముంబై, పూణె, బెంగళూరులో ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీని కోసం బ్లింకిట్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ యునికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

బ్లింకిట్ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అల్బిందర్ ధింద్సా ఒక ప్రకటనలో.. యూనికార్న్ ఏపీఆర్‎తో భాగస్వామ్యంతో కేవలం 10 నిమిషాల్లో iPhone 15ని అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది తమ కస్టమర్‌లకు గొప్ప విలువను అందిస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్లింకిట్ 10 నిమిషాల్లోనే వినియోగదారులకు ఐఫోన్‌లను డెలివరీ చేయగలదని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విటర్లో అల్బిందర్ ధిండా ఒక పోస్ట్‌లో తెలిపారు. యాపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, పూణె, బెంగళూరులలో బ్లింకిట్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

యాపిల్ ఐఫోన్ కొత్త మోడల్‌లను శుక్రవారం నుండి ఆపిల్ విక్రయించడం ప్రారంభించింది. వీటి ధర రూ.79,900 నుంచి రూ.1,99,900 వరకు ఉంది. Apple iPhone 14, iPhone 14 Pro కోసం Blinkit గత సంవత్సరం Unicorn APRతో భాగస్వామ్యం చేసుకుంది. Apple iPhone 15 సిరీస్‌లో iPhone 15, 15 plus, 15 Pro మరియు 15 Pro Maxతో సహా 4 మోడళ్లను విడుదల చేసింది.

ఐఫోన్ 15 ధర
– 128GB: రూ. 79,900
– 256GB: రూ. 89,900
– 512GB: రూ. 1,09,900

ఐఫోన్ 15 ప్లస్
– 128GB: రూ. 89,900
– 256GB: రూ. 99,900
– 512GB: రూ. 1,19,900