Leading News Portal in Telugu

Tata To Make iPhones: ఐఫోన్ల తయారీలోకి టాటా గ్రూప్..


Tata To Make iPhones: ఐఫోన్ల తయారీలోకి టాటా గ్రూప్..

Tata To Make iPhones: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా కొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 115 ఏళ్ల టాటా సంస్థ ఉప్పు నుంచి టెక్నాలజీ దాకా ఎన్నో రంగాల్లో ఉంది. ఇకపై టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. టాటా గ్రూప్ రెండున్నరేళ్లలోనే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఇది భారతదేశ ఉత్పత్తి నైపుణ్యం సత్తాను చాటనుంది.

భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియన్ ఎలక్ట్రానికస్ కంపెనీల వృద్ధికి పూర్తిగా మద్దతు ఇస్తుందని, ఇది భారతదేశాన్ని తమ విశ్వసనీయ తయారీ భాగస్వామిగా మార్చుకునేందుకు, భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ శక్తిగా మార్చాలనే ప్రధాని మంత్రి లక్ష్యాన్ని సాధించాలనుకునే గ్లోబల్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు మద్దతు ఇస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

టాటా గ్రూప్ ఆపిల్ సరఫరాదారు విస్ట్రాన్ కార్ఫ్ కార్యకలాపాలను కొనుగోలు చేసింది. ఈ రోజు జరిగిన బోర్డు మీటింగ్ లో ఈ ప్రకటన వెలువడింది. భారతీయ కంపెనీ భారతదేశం నుంచి ప్రపంచ సరఫరా గొలుసును నిర్మిస్తునందుకు విస్ట్రాల్ కు కేంద్రమంత్రి థాంక్స్ చెప్పారు. మేక్ ఇన్ ఇండియాని పెంపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అనేక ప్రోత్సకాలను ఇస్తున్నారు. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఆపిల్ నెమ్మదిగా చైనా నుంచి బయటకు వస్తోంది.

పీఎల్ఐ( ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్) పథకం ద్వారా దేశీయంగా తయారీని పెంచడం తద్వారా ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులకు మద్దతు ఇవ్వడం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, వస్త్రాలు, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, అధిక సామర్థ్యం గల సోలార్ PV మాడ్యూల్స్, అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు మరియు ఫార్మాస్యూటికల్స్ వంటి 14 సెక్టార్లలో ఈ పథకాన్ని 2021లో ప్రకటించారు.