Success Story: మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులైనా దాటగలం. అలాంటి సంకల్పంతోనే నేడు ఓ వ్యక్తి చదువులో రాణించలేకపోయిన ప్రస్తుతం మూడు సక్సెస్ ఫుల్ కంపెనీలకు యజమాని అయ్యాడు. అతడే సుశీల్ సింగ్.. ఒక మిలియనీర్ టెక్నోప్రెన్యూర్. అతను మూడు సక్సెస్ ఫుల్ కంపెనీలకు యజమాని. అవి SSR Techvision, DeBaco, Cyva Systems Inc. సుశీల్ ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందినవాడు. అతను 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత కాలేజీ చదువును మధ్యలోనే వదిలేశాడు. అతడి సంకల్పానికి ప్రస్తుతం తాను ఉన్న స్థితే నిదర్శనం.
తండ్రి బ్యాంకులో సెక్యూరిటీ గార్డు
సుశీల్ సింగ్ నెలవారీ జీతం రూ.11,000తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈరోజు ఆయన సంపాదన కోట్లలో ఉంది. టెక్నోప్రెన్యూర్‌గా తనదైన ముద్ర వేశారు. అతను మూడు లాభదాయకమైన కంపెనీలతో పాటు ఒక NGOను స్థాపించాడు. చాలా అట్టడుగు నేపథ్యం నుండి వచ్చిన సుశీల్ కుటుంబం ఉద్యోగం వెతుక్కుంటూ జౌన్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామం నుండి ముంబైకి వచ్చింది. అతని తల్లి గృహిణి. తండ్రి బ్యాంకులో సెక్యూరిటీ గార్డు. డోంబివాలి కాలనీలోని చాల్‌లో నివాసం ఉండేవాడు.
ప్రభుత్వ పాఠశాలలో చదివాడు
సుశీల్ గవర్నమెంట్ హిందీ మీడియం స్కూల్లో తన విద్యనభ్యసించాడు. ఈ పాఠశాల కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. 10వ తరగతి వరకు స్కూల్ అంటే చాలా ఆసక్తి. దీని తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా వేగంగా మారిపోయాయి. అతడికి చదువుపై ఆసక్తి తగ్గడం ప్రారంభించింది. సుశీల్ 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ, మరుసటి సంవత్సరం 12వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.
కాలేజీకి మధ్యలోనే డుమ్మా
పాఠశాల విద్య తర్వాత, సుశీల్ కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోసం అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అతడు మెయిన్స సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ, తన ప్రొఫెసర్లు తనకు బోధిస్తున్న పాఠాలు అతడికి అర్థం కాలేదు. దీంతో అతను 2003 లో రెండవ సంవత్సరంలో కళాశాలను విడిచిపెట్టాడు. 2015లో తన పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, సుశీల్ ఒక కంపెనీలో ఎంట్రీ లెవల్ టెలికాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. నెలకు రూ.11వేలు జీతం వచ్చేది.
పెళ్లి నుంచే సక్సెస్ మొదలైంది
2013 నవంబర్‌లో సుశీల్ తొలిసారిగా సరితా రావత్ సింగ్‌ను కలిశాడు. ఆ సమయంలో ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలలో, వారిద్దరూ నోయిడాలో యూఎస్ బేస్ డ్ బిజినెస్ సహకారంతో బీపీవో ప్రారంభించారు. ఇక్కడే SSR టెక్విజన్ ఉనికిలోకి వచ్చింది. యూఎస్ బేస్ డ్ బిజినెస్ లో కేవలం మూడు నుండి నాలుగు నెలలు పనిచేసిన తర్వాత, అతను నోయిడాలో కో-వర్కింగ్ స్పేస్ పొందాడు.
రెండో, మూడో కంపెనీ ప్రారంభం
2.5 ఏళ్ల తర్వాత మొత్తం నోయిడా భవనాన్ని కొనుగోలు చేయాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. అతని రెండవ వ్యాపారం డిబాకో. ఇది గ్లోబల్ B2C ఆన్‌లైన్ బట్టల దుకాణం. అయితే దాన్ని నిర్వహించేది తన భార్య సరిత. ఇటీవల అతను తన మూడవ వ్యాపారాన్ని ప్రారంభించాడు… అదే Cyva Systems Inc. సుశీల్ 2019లో దీన్ని ప్రారంభించాడు. ఇది బహుళజాతి ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. ఇది కంపెనీలకు వారి అవసరాలకు అనుగుణంగా అగ్ర అభ్యర్థులను కనుగొనడంలో సహాయపడుతుంది.