
Paytm: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో ఒక సందర్భంలో వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు చీకట్లను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫెమా, ఫారెక్స్ ఉల్లంఘటన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం కార్యకలాపాలను నిలిపేయాలని జనవరి 31న ఆదేశించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారణలోకి ఎంటరైంది. మరోవైపు ఆర్బీఐ అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మను కలిశారు. పేటీఎంకి సంబంధించిన లావాదేవీల గురించి సమాచారాన్ని సేకరించాలని ఈడీ అధికారులు ఆర్బీఐని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం UPI సేవలను కొనసాగిస్తుందా..? లేదా.? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై పేటీఎం సోమవారం క్లారిటీ ఇచ్చింది. తన యూపీఐ సేవలు సాధారణంగా పనిచేస్తాయని.. సేవల కొనసాగింపును నిర్ధారించడానికి బ్యాక్ ఎండ్‌లో మార్పుల కోసం కంపెనీ ఇతర బ్యాంకులతో కలిసి పనిచేస్తుందని తెలిపింది.
పేటీఎం యూపీఐ సేవలు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్(PBBL) కిందకు వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం వాలెట్ టాప్-అప్‌లతో సహా వినియోగదారులకు కీలకమైన సేవలను అందించకుడా ఆర్బీఐ నిషేధం విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత రోడ్ టోల్లు చెల్లించడానికి ఎటువంటి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు నిర్వహించవద్దని PBBLని ఆదేశించింది.