Leading News Portal in Telugu

Zomato: అందరికీ రెడ్ డ్రెస్.. గ్రీన్ డ్రెస్ ‘‘వెజ్ ఫ్లీట్’’పై వెనక్కి తగ్గిన జొమాటో..



Zomato

Zomato: తీవ్ర విమర్శల నేపథ్యంలో జొమాటో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శాఖాహారుల కోసం ‘‘ఫ్యూర్ వెజ్’’ ఫ్లీట్ ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం డెలివరీ బాయ్స్‌కి సరికొత్త ఆకు పచ్చ డ్రెస్‌కోడ్, గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంటుందని నిన్న ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. శాఖాహారుల కోసం ఇకపై శాకాహార రెస్టారెంట్ల నుంచి ఈ గ్రీన్ ఫ్లీట్ ద్వారా డెలివరీలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని కులతత్వంగా, మతపరంగా వివక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఇకపై కొన్ని హౌసింగ్ సొసైటీలు రెడ్ డ్రెస్ కలిగిన డెలవరీ బాయ్స్‌ని నిషేధిస్తాయి’’ అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. ఇది వివక్షను చూపిస్తుందని విమర్శించారు.

Read Also: Ilayaraaja: ‘ఇళయరాజా’ బయోపిక్ లో హీరో ధనుష్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..

ఈ విమర్శల నేపథ్యంలో ఈ రోజు జొమాటో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై తమ డెలివరీ పార్ట్‌నర్స్ అందరూ ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం కొనసాగిస్తారని తెలిపింది. ప్యూర్ వెజ్ ఫ్లీట్ కింద ఆహారాన్ని డెలివరీ చేసే వారు ఆకుపచ్చ యూనిఫాంని ధరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ‘‘ మేము ఈ విభజనను తొలగించాలని నిర్ణయించుకున్నాము. మా రైడర్లందరూ- మా రెగ్యులర్ ఫ్లీట్, శాఖాహారుల కోసం రెడ్ కలర్ డ్రెస్ కలిగి ఉంటారు’’ అని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఈ రోజు ట్వీట్ చేశారు. మా కస్టమర్లలో కొందరు వారి భాగస్వాములతో ఇబ్బంది పడొచ్చని మేము గ్రహించామని, అది మంచి విషయం కాదని పోస్టులో పేర్కొన్నారు.

దీని వల్ల వచ్చే పరిణామాలను తెలియజేసిందనుకు నెటిజన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ అనాలోచిత పరిణామాలను మాకు అర్థమయ్యేలా చేశారని, మేము గర్వం, అహం లేకుండా ఎల్లప్పుడూ వింటామని, మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తామని ఆయన చెప్పారు. నిన్న ‘‘ప్యూర్ వెజ్’’ సేవల్ని ప్రారంభిస్తున్నామని డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్‌లో ఉంటుందని జొమాటో తెలియజేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. మాంసాహారం ఆర్డర్ చేసే వారికి ఇది అసౌకర్యంగా ఉంటుందని, రెంట్‌కి ఉంటున్న వారిలో కొందరికి డ్రెస్‌‌కోడ్‌తో సమస్య ఎదురవుతుందని కామెంట్స్ చేయడంతో జొమాటో దిగివచ్చింది.