
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ బడ్జెట్‌పైనే అందరి దృష్టి ఉంది. దేశ వృద్ధి ఇంజిన్‌లో భాగమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎంఎస్ఎంఈలకు ఉపశమనం కారణంగా ముఖ్యంగా రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీలో వృద్ధికి అవకాశం ఉంది.
అలాగే విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు కేటాయించారు. ఐదు సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యాలు, ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ఐదు కొత్త పథకాలు, ప్యాకేజీని ప్రకటించారు. రూ. 2 లక్షల కోట్ల కేంద్ర వ్యయంతో.. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు ఇచ్చారు. వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఇది 400 జిల్లాల్లో అమలు చేయనున్నారు. మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం.. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు.. 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం.. మహిళలనైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.