
Gautam Adani Retirement: దేశంలో బడా పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(62) తన 70వ ఏటా పదవీవిరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. 2030ల్లో వ్యాపార సామ్రాజ్య పట్టపు పగ్గాలను తన వారసులకు కట్టబెడుతానని స్పష్టం చేశారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ నివేదికలో వివరాలు వెలువడ్డాయి. ఒక తరం నుండి మరొక తరానికి నియంత్రణ బదిలీ అనేది దేశంలోని పెద్ద వ్యాపార సమూహాలలో ఎల్లప్పుడూ వివాదాస్పద అంశం. రిలయన్స్ నుండి గోద్రెజ్, కెకె మోడీ గ్రూప్ వరకు వ్యాపార సామ్రాజ్యాల విభజనకు సంబంధించిన వివాదాలు కోర్టుకు చేరి వార్తల్లో నిలిచాయి. దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన కుటుంబంలో ఇలాంటి వివాదాస్పద పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తనకు 70 ఏళ్లు వచ్చేసరికి పదవీ విరమణ చేయబోతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం గౌతమ్ అదానీ వయసు 62 ఏళ్లు. అంటే అతను రాబోయే 8 సంవత్సరాలలో క్రియాశీల వ్యాపారం నుండి రిటైర్ కావచ్చు. అతని తర్వాత వ్యాపార సామ్రాజ్యన్ని నడిపించే బాధ్యత అతని కొడుకులు, మేనల్లుళ్ల భుజాలపై పడుతుంది. ఈ మార్పు అమలు 2030 నుండి ప్రారంభమవుతుంది. గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులు అవుతారని నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ..అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు జీత్ అదానీ..అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ..అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ..అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ పదవీ విరమణ తర్వాత, నలుగురు వారసులు గ్రూప్‌లో సమాన బాధ్యతను పొందవచ్చు. ఆయన తర్వాత గ్రూప్ చైర్మన్ బాధ్యత ఆయన పెద్ద కొడుకు కరణ్ అదానీ లేదా మేనల్లుడు ప్రణవ్ అదానీకి వెళ్లవచ్చు. దానీ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా వారసత్వ బదిలీ జరుగుతుంది.