Leading News Portal in Telugu

BSNL 5G Network: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్‌డేట్‌!


  • అందరి చూపు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపే
  • 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్‌డేట్‌
  • వచ్చే జనవరిలో 5జీ సేవలు
BSNL 5G Network: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్‌డేట్‌!

BSNL 5G Network Update: ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్‌ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పుడైతే పెంచాయో.. అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) వైపు మళ్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌లను తీసుకొస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. తాజాగా 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీ తన 5జీ నెట్‌వర్క్‌ను అతి త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. టెస్టింగ్ దశ పురోగతిని సాధించిందని, త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. 2025 జనవరిలో 5జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నాహాలు చేస్తోంది. వీలైనంత త్వరగా 5జీ రోల్‌ అవుట్‌ను సులభతరం చేయడానికి దాని మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి సారించింది. 4జీ సేవలను 5జీకి మార్చడానికి కసరత్తు చేస్తోంది. 4జీ సేవలను ప్రారంభించిన ప్రాంతాల్లో 5జీ రోల్ అవుట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అప్‌గ్రేడ్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 2025 నాటికి 1,00,000 టవర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. వేగవంతమైన 5జీ సేవలను వినియోగదారులకు అందించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.