ఆర్‌కామ్ కథ కంచికే !
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు చెల్లించాల్సి ఉన్న రూ.1,000 కోట్ల బకాయిలకు సంబంధించి జరుగుతున్న చర్చలు విఫలమైనట్టు సమాచారం. ఈ బకాయిల వసూలు కోసం ఎరిక్సన్ ఇప్పటికే దివాలా చట్టం కింద ఆర్‌కామ్‌ను ఎన్‌సిఎల్‌టికి లాగింది. ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటే 15 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని ఆర్‌కామ్ ప్రతిపాదించింది. ఇందుకోసం తన నిర్వహణలోని ఏదైనా ఒక కంపెనీతో హామీ ఇవ్వడం లేదా ఆర్‌కామ్‌తో పాటు దాని రెండు అనుబంధ కంపెనీల డైరెక్టర్ల చేత హామీ ఇచ్చేందుకు సిద్ధమని అంబానీ చేసిన ప్రతిపాదనను ఎరిక్సన్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలు దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఎన్‌సిఎల్‌టి ఇప్పటికే ఎరిక్సన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఇంటీరియం రిసొల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆఆర్పి)ను నియమించింది. ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఆర్‌కామ్ భారీ సంచలనమే సృష్టించింది. పోస్టు కార్డు ధరకే ఫోన్ కాల్స్ పేరుతో అప్పటి ప్రధాన పోటీదారులను ఖంగుతినిపించింది. ఆస్తుల విభజన తర్వాత ఈ కంపెనీ అనిల్ అంబానీ చేతికి వచ్చింది. తర్వాత మార్కెట్ పోటీకి తగ్గట్టు పోటీపడలేక వెనకబడింది. దీంతో రూ.46,000 కోట్ల వరకు అప్పుల భారం పెరిగిపోయింది. జియో దెబ్బతో నష్టాలు మరింత పెరగడంతో ఇటీవలే 2జి, 3జి సేవలు బంద్ చేసింది. అప్పులు తీర్చేందుకు స్పెక్ట్రమ్, ఫైబర్ నెట్వర్క్, టవర్లను జియోకు రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు అంగీకరించింది.